ప్రధాన ప్రతిపక్షం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకుని, అరెస్టు చేశారు. అనంతరం కేటీఆర్, కవిత సహా పార్టీ ప్రజాప్రతినిధులను పోలీసు వ్యానుల్లో అక్కడి నుంచి తరలించారు. సోమవారం ఉదయం దీక్షా విజయ్ దివస్ సందర్భంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ అమరులకు నివాళులర్పించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, అదానీ ఫొటోతో కూడిన టీషర్టులను ధరించి అసెంబ్లీకి బయల్దేరారు. దీంతో అసెంబ్లీ గేటు-2 వద్ద వారిని పోలీసులు అడ్డుకున్నారు. రేవంత్, అదానీతో కూడిన టీషర్టు ధరించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొన్నది.
ఈ నేపథ్యంలో పోలీసుల అధికారులను కేటీఆర్ నిలదీశారు. తమను ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలన్నారు. రేవంత్ అదానీ భాయి భాయి అంటూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేశారు. ఢిల్లీలో కుస్తీ.. గల్లీలో దోస్తీ, తెలంగాణ తల్లి మాది.. కాంగ్రెస్ తల్లి నీది, బతుకమ్మను తీసి చేయి గుర్తు పెట్టిందంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ క్రమంలో కేటీఆర్, హరీశ్ రావు, కవిత, సబితా ఇంద్రారెడ్డితోపాటు పార్టీ ప్రజాప్రతినిధులు అరెస్టు చేసి పోలీసు వ్యానుల్లో అక్కడి నుంచి తరలించారు.