చైనాలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ ను ప్రపంచ దేశాలు ఎంత మాత్రం తేలికగా తీసుకోవడానికి వీలులేదు. శీతాకాలంలో అత్యంత వేగంగా విస్తరిస్తూ మానవాళి మనుగడకు ఈ కొత్త వైరస్ సవాల్ విసురుతోంది. చైనాలో ఇప్పటికే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కోవిడ్ నుంచి ప్రపంచ దేశాలు గుణపాఠాలు నేర్చుకుంటున్నట్లు కనిపించడం లేదు. ఇప్పటి వరకూ ఏ దేశమూ కూడా ట్రావెల్ ఆంక్షలు విధించలేదు. దీంతో ప్రపంచం మరో సారి కరోనా నాటి పరిస్థితులు ఎదుర్కొన వలసి వచ్చే ప్రమాదం ఉందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతోంది. అయితే ఆ ఆందోళన అభూత కల్పన కాదని తాజాగా ఇండియాలో ఓ చిన్నారిలో హెచ్ఎంపీవీ వైరస్ గుర్తించడంతో తేటతెల్లమైంది. బెంగళూరులో ఓ ఎనిమిది నెలల చిన్నారిలో ఈ వైరస్ ను గుర్తించారు.
కరోనా కంటే కొన్ని రెట్లు అధిక వేగంతా హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి చెందుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వారు చెప్పిన మాటలు అక్షర సత్యాలని చైనాలో ఈ వైరస్ వ్యాపిస్తున్న వేగం చూస్తుంటే తెలుస్తుంది. ఇప్పుడు ఇండియాలో కూడా ఈ వైరస్ వెలుగు చూడటంతో ప్రజలు వణికి పోతున్నారు. ఈ వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి చెందుతుందన్న భయం అవసరం లేదనీ, దేశంలో ఆరోగ్య వ్యవస్థలు, నిఘా నెట్ వర్క్‌లు అప్రమత్తంగా ఉన్నాయని, ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు దేశం సిద్ధంగా ఉందని భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎవరికైనా దగ్గు, జలుబు ఉంటే ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి వారు ఇతరులత కాంటాక్ట్‌లోకి రాకుండా ఉండాలని ఆయన ప్రజలను కోరారు. “జలుబు, జ్వరానికి అవసరమైన సాధారణ మందులు వాడాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు,” అని గోయల్ పేర్కొన్నారు. అయితే బేంగళూరులో హెచ్ఎంపీవీ వైరస్ వెలుగు చూడటంతో ఇక క్వారంటైన్ పరిస్థితులను దేశం మరోసారి చూడాల్సి వస్తుందా అన్న భయందోళనలు ప్రజలలో వ్యక్తం అవుతున్నాయి.