సంతోషం సగం బలం అన్నారు పెద్దలు. సంతోషంగా ఉంటే జీవితంలో చాలా సమస్యలు జయించవచ్చు. కానీ సంతోషంగా ఉండనీయకుండా చేసే సందర్బాలు, సమస్యలు చాలా ఉంటాయి. మరీ ముఖ్యంగా సమస్యలు ఎన్ని ఉన్నా వాటిని ఆలోచనతో, తెలివిగా ఎదుర్కోవాలి అంటే మనసు ప్రశాంతంగా ఉండాలి. మనసు గందరగోళంలో, ఒత్తిడిలో ఉంటే సంతోషం అనే మాట దూరంలోనే ఉండిపోతుంది. జీవితంలో సంతోషంగా ఉండాలంటే మనసును, మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇందుకోసం ఏం చేయాలంటే..
శ్వాస..
శ్వాస అనేది ప్రతి క్షణం, ప్రతి మనిషిలో జరిగే అసంకల్పిత చర్య. అయితే శ్వాస వ్యాయామాలు మనిషిని సంతోషంగా ఉంచడంలో సహాయపడతాయి. ప్రతిరోజూ శ్వాస వ్యాయామాలు చేస్తుంటే.. ముఖ్యంగా లోతైన శ్వాస వ్యాయామాలు చేస్తే ఆందోళన తగ్గుతుంది. ఒత్తిడి నియంత్రణలోకి వస్తుంది. మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది.
ఆహారం..
ఆహారం శరీరానికి శక్తి వనరు. అయితే ఆహారం తినే విధానం మనసును ప్రభావితం చేస్తుంది. మైండ్ ఫుల్ ఈటింగ్ అనేది ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అవుతోంది. అంటే మనసు పెట్టి ఆహారాన్ని శ్రద్దగా తినడం. తినేటప్పుడు ఆహారాన్ని ఆస్వాదించడం. ఆహారం వాసన, ఆహారం ఎలా ఉంది అని దాన్ని మనసుతో పరిశీలించి తినడం. ఇలా చేయడం వల్ల తిన్న ఆహారం శరీరానికి మాత్రమే కాదు.. మనసుకు కూడా తృప్తిని ఇస్తుంది.
నడక..
నడక చాలామంది చేసే వ్యాయామంలో భాగం. అయితే నడిచేటప్పుడు నడకను కూడా పరిశీలించాలి. నడిచేటప్పుడు పాదాల కదలిక, అడుగులలో లయ మొదలైనవి క్షుణ్ణంగా పరిశీలిస్తే మీరు వాకింగ్ చేయడంలో లవ్ లో పడతారు. ఇది మనసుకు చాలా తృప్తిని ఇస్తుంది.
శ్రద్ద..
శ్రద్దగా ఏ పనిని అయినా చేస్తే ఎంత పరిపూర్ణ ఫలితాలు వస్తాయో.. ఇతరులు ఏదైనా చెప్పేటప్పుడు అంతే శ్రద్దగా వెంటే వ్యక్తులతో బంధాలు బాగుంటాయి. శత్రుత్వం లేకుండా స్నేహభావంతో కూడిన బంధాలు ఉంటే మనసుకు ప్రశాంతత, జీవితంలో సంతోషం లభిస్తాయి.
పని..
నేటి కాలంలో చాలామంది మల్టీ టాస్కర్లే.. ఇది మనిషిని ఒత్తిడిలోకి నెట్టుతుంది. జీవితంలో సంతోషం కావాలంటే మల్టీ టాస్కింగ్ ను పక్కన పెట్టి సింగిల్ టాస్క్ లను చేస్తూ ఉండాలి. పైగా మల్టీ టాస్క్ చేసేటప్పటితో పోలిస్తే.. సింగిల్ టాస్క్ చేసేటప్పుడు పని మీద ఎక్కువ శ్రద్ద పెట్టడం, పనిని చాలా బాధ్యతగా ఆసక్తిగా పూర్తీ చేయడం దాని ఫలితాలు కూడా మెరుగ్గా ఉండటం గమనించవచ్చు. ఇవి జీవితంలో సంతోషాన్ని మెరుగు పరుస్తాయి.
కమ్యూనికేషన్..
ఇతరులతో కమ్యూనికేషన్ బాగుంటే చాలా వరకు ప్రశాంతంగా ఉండవచ్చు. వ్యక్తిగతంగా అయినా, ఉద్యోగ పరంగా అయినా కమ్యునికేషన్ కీలకపాత్ర పోషిస్తుంది. ఇది వ్యక్తులతో బంధాలు మెరుగ్గా ఉండేలా సహాయపడుతుంది.
అలసట..
అలసట మనిషిని ఒత్తిడిలోకి నెట్టుతుంది. అందుకే ఒకే చోట ఎక్కువసేపు కూర్చుని ఒకే పని చేయకూడదు. పని నుండి అప్పుడప్పుడు కాస్త దృష్టి మరల్చడం, రిలాక్స్ అవ్వడం మనిషిని అలసటకు లోను కానీయవు.