దేశంలో నల్లధనాన్ని అరికట్టాలన్న ఉద్దేశంతో ప్రధాని నరేంద్రమోడీ 2016లో పెద్ద నోట్లను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంతో దేశంలో ఒక్కసారిగా సామాన్యుల నుంచి సంపన్నుల వరకూ నానా ఇబ్బందులూ పడ్డారు. 2016 నవంబర్ 8న ప్రధాని పెద్ద నోట్లు రద్దు చేసినట్లు ప్రకటించారు. సరిగ్గా ఆ ఆ రోజు నుంచి రెండు నెలల పాటు దేశంలోని ప్రజలంతా బ్యాంకుల ముందు క్యూలలో నిబబడి కొద్ది మొత్తం తమ ఖాతాల నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకోవడమే రోజు వారీ కార్యక్రమంగా మారిపోయింది. రోజు వారీ అవసరాలకు కూడా సొమ్ములు లేక జనం నానా ఇబ్బందులూ పడ్డారు. అయినా దేశంలో నల్లధనం లేకుండా పోతుంది, ఉగ్ర కార్యకలాపాలు తగ్గుముఖం పడతా యన్న ఆశతో ఆ ఇబ్బందులన్నీ ఎదుర్కొన్నారు.
అయితే నల్లధనం లేకుండా చేయాలన్న మోడీ ఉద్దేశం పెద్ద నోట్ల రద్దుతో ఎంత వరకూ నెరవేరిందో తెలియదు కానీ, పాత నోట్లు రద్దు చేసి కొత్త నోట్లు చెలామణిలోకి వచ్చిన ఇన్నేళ్ల తరువాత కూడా దేశంలో దొంగనోట్ల చెలామణి యథేచ్ఛగా సాగుతోంది. ప్రధానంగా ఇప్పుడు భారత కరెన్సీలో అత్యధికంగా చెలామణిలో ఉన్న రూ.500 నోట్లలో అసలు నోటేదో, నకిలీ ఏదో గుర్తుపట్టడం దాదాపు అసాధ్యంగా మారిపోయిన పరిస్థితులు ఉన్నాయి. పెద్ద మొత్తంలో రూ.500 నకిలీ నోట్లు చెలామణి అవుతున్నాయి. ఈ నోట్లలో అసలేదీ, నకిలీ ఏదీ అని గుర్తుపట్టడం కష్ట సాధ్యంగా ఉందని బ్యాంకులే చెబుతున్నాయి. అంత పకడ్బందీగా నకిలీ నోట్లు ముద్రిస్తున్నారని అంటున్నారు. రూ.500ల నోట్లలో అసలుకూ నకిలీకీ తేడా ఏమిటో సామాన్యలు గుర్తించడం చాలా చాలా కష్టమని అంటున్నారు. అయితే అసలులో రిజర్వ్ బ్యాంక్ స్పెల్లింగ్ కరెక్టుగా ఉంటే నకిలీ నోటులో ఆ స్పెల్లింగ్ చిన్న తప్పు ఉందనీ, అసలేదో, నకిలీ ఏదో తెలుసుకోవడానికి అదో మార్గమనీ చెబుతున్నారు.
అసలు నోటులో రిజర్వ్ బ్యాంకు అన్న స్పెల్లింగ్ కరెక్టుగా ఉంటే నకిలీ నోటులో రిజర్వ్ బ్యాంకు స్పెల్లింగ్ ఆర్ఇఎస్ఏఆర్ విఇ అని ఉంటుందని చెబుతున్నారు. అక్షరాస్యత శాతం తక్కువగా ఉన్న భారత్ లో ఈ తేడాను గుర్తించగలిగేది ఎందరు? అన్న అనుమానాలూ వ్యక్తమౌతున్నాయి. మొత్తం మీద పెద్ద నోట్ల రద్దు తరువాత కూడా దేశంలో నకిలీ నోట్లు ఏ మాత్రం తగ్గలేదనీ, నోట్ల రద్దుతో మోడీ సాధించిందేమిటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి