తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. సచివాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన 20 అడుగుల తెలంగాణ తల్లి కాంస్య విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. గుండుపూసలు, హారం, ముక్కుపుడక, ఆకుపచ్చ చీర, కడియాలు, మెట్టెలతో పాటు చాకలి ఐలమ్మ, సమ్మక్క సారలమ్మ పోరాట స్ఫూర్తితో ఈ విగ్రహాన్ని రూపొందించినట్లు ప్రభుత్వం పేర్కొంది. వరి, మొక్కజొన్నలు, సజ్జలు, జొన్నలు తెలంగాణ తల్లి చేతిలో కనిపించేలా విగ్రహం రూపొందించారు. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
తెలంగాణ తల్లి విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తిస్తూ జీవో జారీ చేసింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. బంగారు అంచు కలిగిన ఆకుపచ్చ చీరను ధరించి, ప్రశాంతమైన నడవడికతో సంప్రదాయ మహిళా మూర్తిగా ఉన్న విగ్రహాన్ని తెలంగాణ తల్లి విగ్రహంగా ప్రభుత్వం ఆమోదించింది. ఇక నుంచి తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలను ప్రతి సంవత్సరం డిసెంబర్ 9న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించాలని ప్రభుత్వం జీవోలో పేర్కొంది.
దీంతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, కలెక్టరేట్ లలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని పేర్కొంది. తెలంగాణ తల్లి విగ్రహం ఆత్మగౌరవానికి ప్రతీక అని, తెలంగాణ తల్లి విగ్రహం, రూపురేఖలను వక్రీకరించడం, మరో విధంగా చూపించడం నిషేధమని జీవోలో పేర్కొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహ చిత్రాలను బహిరంగంగా లేదా సోషల్ మీడియాలో అగౌరవపరచడం, నాశనం చేయడం, కాల్చడం, అవహేళన చేయడం, అవమానించడం లేదా కించపరచడం నేరమని జీవోలో పేర్కొంది.
‘తెలంగాణ తల్లి అంటే ఒక భావన మాత్రమే కాదు. 4 కోట్ల బిడ్డల భావోద్వేగం. ఆ భావోద్వేగానికి నిండైన రూపం మన తెలంగాణ తల్లి. ప్రజల మనోపలకాలపై నిలిచిన తెలంగాణ తల్లి రూపాన్ని సచివాలయం సాక్షిగా ఆవిష్కరించేందుకు ప్రజా ప్రభుత్వం సిద్ధమైంది’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ తల్లి రూపకల్పనలో మన సంప్రదాయాలు, సంస్కృతులు చారిత్రక నేపథ్యాలను పరిగణలోకి తీసుకొని ఒక నిండైన రూపాన్ని తీర్చిదిద్దామని సీఎం తెలిపారు.
తెలంగాణ తల్లి విగ్రహం ప్రత్యేకతలు
తెలంగాణ సంస్కృతికి అద్దం పడుతూ ప్రశాంత వదనంతో సంప్రదాయ కట్టుబొట్టుతో మెడకు కంటె.. గుండు పూసల ఆహారంతో, చెవులకు బుట్ట కమ్మలతో, ముక్కు పుడకతో, బంగారు అంచు కలిగిన ఆకుపచ్చ చీరలో, చేతికి గాజులు, కాళ్లకు కడియాలు మెట్టలతో, చాకలి ఐలమ్మ, సమ్మక్క సారలమ్మ పోరాట స్ఫూర్తితో ఎంతో హుందాతో కూడిన ఆహార్యంతో మన తెలంగాణ తల్లి రూపొందించారు.
కుడి చేతితో జాతికి అభయాన్నిస్తూ ఎడమ చేతిలో తెలంగాణ మాగాణంలో పండే సంప్రదాయ పంటలైన వరి జొన్నలు, సజ్జలు, మొక్కజొన్న పంటలతో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి నిలువెత్తు రూపంగా తీర్చిదిద్దారు. తెలంగాణ తల్లి నిలుచున్న పీఠం చరిత్రకు దర్పణంగా రూపొందించారు. తెలంగాణ చిరునామానే ఉద్యమాలు పోరాటాలు, అమరుల ఆత్మ బలిదానాలు, దానికి సంకేతంగా పీఠంలో బిగించిన పిడికిళ్లను పొందుపరిచారు.
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే సమున్నతంగా నిలబెట్టాలన్న లక్ష్యాన్ని గుర్తు చేస్తూ చేతులన్నీ కలిపి పీఠాన్ని మోస్తున్న తీరు తెలంగాణ పునర్నిర్మాణ రీతిని తెలియజేస్తుంది. తెలంగాణ తల్లి రూపకల్పనలో ఉపయోగించిన వర్ణాలకు కూడా ప్రత్యేకత ఉంది. గొప్ప తాత్వికత ఉంది. పీఠంలో, నీలి వర్ణం గోదావరి, కృష్ణమ్మలు తల్లీ నిన్ను తడపంగా… అన్న అందెశ్రీ గీతంలోని తెలంగాణ జలదృశ్యానికి ప్రతీకగా నిలుస్తుంది.
ఆకుపచ్చ వర్ణం పచ్చని నేలలో పసిడి సిరులు పండంగా.. అన్న తెలంగాణ సస్యశ్యామల వ్యవసాయ కీర్తికి సంకేతంగా కనిపిస్తుంది. ఎరుపు వర్ణం మార్పుకు ప్రగతికి చైతన్యానికి ప్రతీక. బంగారు వర్ణం శుభానికి ఐశ్వర్యానికి సమృద్ధికి నిదర్శనంగా నిలబడుతుంది.