మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న సినిమా కన్నప్ప. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ లోనే విడుదల కావాల్సి ఉంది. అయితే అనూహ్యంగా వచ్చే ఏడాదికి వాయిదా పడింది. తాజాగా కన్నప్ప సినిమా గురించి ఓ నెటిజన్ ఆసక్తికర ట్వీట్ పెట్టాడు. దీనికి విష్ణు కూడా స్పందించాడు.
మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్టుగా కన్నప్ప సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మహా భారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వ వహిస్తున్నారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ప్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ శివుడిగా కనిపించనున్నాడు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే కన్నప్ప మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. కాగా మొదట కన్నప్ప సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేస్తామని రూమర్లు వినిపించాయి. అయితే ఇప్పుడు అనూహ్యంగా వచ్చే ఏడాది ఏప్రిల్ కు వాయిదా వేశారు. దీనికి తోడు ఈ మధ్యన మంచు ఫ్యామిలీలో వివాదం నడుస్తోంది. గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా మోహన్ బాబు ఇంటి గొడవలకు సంబంధించిన వార్తలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో కన్నప్ప సైడ్ అయిపోయింది. అయితే అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా కన్నప్ప టీమ్ జాగ్రత్త పడుతోంది. అందుకే ఇటీవల మోహన్ లాల్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు.
తాజాగా కన్నప్ప సినిమా గురించి తాజాగా ఒక నెటిజన్ ఆసక్తిర ట్వీట్ పెట్టాడు. మంచు విష్ణును ట్యాగ్ చేస్తూ.. ‘అన్నా.. సినిమా ఎలా ఉన్నా పర్లేదు. ప్రభాస్ లుక్స్, పాత్ర మాత్రం తేడా రాకుండా చూస్కో. ఒక్కసారి కాదు ఐదు సార్లు వెళ్తా నీ సినిమాకు’ అని రాసుకొచ్చాడు. దీనికి మంచు విష్ణు కూడా వెంటనే స్పందించాడు.. ‘100 శాతం మీకు ప్రభాస్ పాత్ర నచ్చుతుంది బ్రదర్. కాస్త ఓపిగ్గా ఉండు. త్వరలో బోలెడన్ని విషయాలు చెబుతా’ అని రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.