ప్రపంచంలో ప్రతీ దేశంలోనూ వేర్వేరు జాతులవారు, వేర్వేరు భాషలవారు,  వేర్వేరు మతపరమైన విశ్వాసాలు కలిగినవారు ఉంటారు. ఇందులో కొన్ని వర్గాల వారు సంఖ్యాపరంగా చాలా ఎక్కువగా ఉంటారు.  కొన్ని వర్గాలవారి సంఖ్య  తక్కువ లేదా చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి వారిని మైనారిటీలగా గుర్తిస్తారు. ఇక భారతదేశం గురించి మాట్లాడుకుంటే, మన దేశంలో ఉన్నంత  భిన్నత్వం ఏ దేశంలోనూ  ఉండదు. అయినా సరే భిన్నత్వంలో ఏకత్వానికి మంచి ఉదాహరణగా ఇప్పటికీ నిలుస్తుంది. దీనికి కారణం మన భారత రాజ్యాంగం దేశ పౌరులందరికీ  సమాన హక్కులను అందించడమే కాకుండా భాష, జాతి, సాంస్కృతిక, మతపరమైన మైనారిటీల  హక్కులను రక్షించడానికి పలు చర్యలను అమలు చేసింది. మైనారిటీల హక్కులు, భద్రత, అభివృద్ధి గురించి అవగాహన కల్పించడం,  మైనారిటీల సమస్యలను గుర్తించి, వారి రక్షణ కోసం చర్యలు తీసుకోవటానికి భారతదేశంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ 18న మైనారిటీల హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

మైనారిటీ హక్కుల దినోత్సవం  ఎప్పుడు మొదలైంది..

మొదటి మైనారిటీ హక్కుల దినోత్సవం 2013లో ప్రారంభమైంది. ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించిన  మైనారిటీల హక్కుల ప్రకటనపై  సంతకం చేసిన తరువాత మనదేశం ఈ దినోత్సవాన్ని జరపడం ప్రారంభించింది. భారత ప్రభుత్వం 1992లో స్థాపించిన ‘జాతీయ మైనారిటీ కమిషన్ (NCM)’, ఈ  మైనారిటీల హక్కులని కాపాడటంలో ముఖ్యపాత్ర పోషిస్తోంది.

2024 థీమ్…

ప్రతి సంవత్సరం ప్రత్యేకమైన థీమ్‌ను ఎంపిక చేస్తారు.  2024 సంవత్సరానికి “వైవిధ్యాన్ని ప్రోత్సహించటం, హక్కులను కాపాడటం” అనే థీమ్ ప్రకటించారు.  మన దేశంలో మత, భాష, సాంస్కృతిక, సామాజిక పరంగా ఉన్న వైవిధ్యాన్ని గుర్తించి  మైనారిటీల హక్కులను కాపాడాల్సిన  అవసరాన్ని ఈ  థీమ్ తెలియజేస్తుంది.

మైనారిటీ హక్కుల దినోత్సవం  ఎందుకు అవసరం..

మైనారిటీలకు సమాన హక్కులు, సామాజిక న్యాయం అందించడంతో పాటు వారి అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది.  రాజ్యాంగపరంగా, చట్టపరంగా మైనారిటీలకి ఉన్న  హక్కుల గురించి అవగాహన కల్పిస్తుంది. సామాజిక, ఆర్థిక, విద్యా లోటుపాట్లను తొలగించటానికి కృషి చేస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 29, ఆర్టికల్ 30 క్రింద మైనారిటీలకు హక్కులు కల్పిస్తుంది. ప్రభుత్వాలు, ఎన్జీవోలు, ప్రజలు అందరూ కలిసి మైనారిటీల సంక్షేమం కోసం  పనిచేయాలని పిలుపునిస్తుంది.

భారతదేశంలో ఎవరు మైనారిటీలు?

భారతదేశంలో మైనారిటీలను మతం, భాష, సంస్కృతిపై ఆధారపడి నిర్వచిస్తారు. జాతీయ మైనారిటీ కమిషన్ ప్రకారం, 6 మత సమూహాలు అధికారికంగా మైనారిటీగా గుర్తించబడ్డాయి. మొదట ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు(జొరాష్ట్రియన్లు) మైనారిటీలుగా గుర్తించబడ్డారు. ఆ తర్వాత 2014లో జైనులను కూడా మైనారిటీలో భాగం చేశారు.  2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలోని మైనారిటీల్లో మొదటి స్థానంలో ముస్లింలు, చివరి స్థానంలో పార్శీలు ఉన్నారు. కేవలం మతం ఆధారంగానే కాకుండా  భాష, జాతి ఆధారంగా  కూడా మైనారిటీ వర్గాలు భారతదేశంలో ఉన్నాయి. మైనారిటీలందరికీ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 29, 30..  సాంస్కృతిక, విద్యా హక్కులను రక్షిస్తాయి.

నేషనల్  మైనారిటీ కమిషన్ పాత్ర….

జాతీయ మైనారిటీ కమిషన్ 1992లో స్థాపించబడింది. ఇది మైనారిటీల హక్కులను రక్షించి, వారి సామాజిక, ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తుంది. మైనారిటీల రాజ్యాంగ హక్కుల అమలును పర్యవేక్షించటం, హక్కులకి భంగం కలిగినప్పుడు ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరించడం, మైనారిటీల అభివృద్ధికి పాలసీలను సిఫార్సు చేయటం,  వారి  ఆర్థిక, సామాజిక పురోగతిని సమీక్షించటం ఈ కమిషన్ ముఖ్య విధులుగా ఉన్నాయి.
మైనారిటీల హక్కులని కాపాడటానికి,  చాలా రాష్ట్రాల్లో కూడా  స్టేట్ మైనారిటీ కమీషన్లు ఏర్పాటు చేయబడ్డాయి. ఇవి కూడా మన రాజ్యాంగానికి అనుగుణంగానే  మైనారిటీల హక్కుల్ని కాపాడి, వారి అభివృద్ధికి కృషి చేస్తాయి.

మైనారిటీ హక్కుల దినోత్సవం ద్వారా ప్రభుత్వం, సమాజం, ప్రజలు  కలిసికట్టుగా మన దేశంలో సమానత్వం, న్యాయం కోసం పని చేయాలి. మన దేశ అభివృద్ధిలో మైనారిటీల పాత్రని కూడా గుర్తించాలి. సమాజంలో ఏ ఒక్కరూ వివక్షకి గురి కావటమో లేక హక్కులకి, అభివృద్ధికి దూరం కాబడటమో అనేది  వారితోపాటూ ఆ సమాజానికే మంచిది కాదు.  కాబట్టి  మైనారిటీల హక్కులను పరిరక్షించే సమాజాన్ని నిర్మించేందుకు అందరం కృషి చేయాల్సిన అవసరం ఉందని గ్రహించి, ఆ దిశగా పని చేయాలి. ఇలా ఉన్నప్పుడు  మన భారతదేశం ఎప్పటికీ భిన్నత్వంలో ఏకత్వానికి  ఉత్తమ ఉదాహరణగా నిలిచిపోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here