కడపలో వైసీపీ ఉనికి మాయం అయిపోతోందా? ఆ పార్టీకి నేతలేలేకుండా పోతున్నారా? కడప జిల్లాలో తొలి నుంచీ ఉన్న వైఎస్ కుటుంబం పట్టు సడలుతోందా? అంటే వరుసగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న ఎవరైనా ఔననే సమాధానం ఇస్తారు. జగన్ వైసీపీ పార్టీ స్థాపించిన నాటి నుంచీ కడపలో ఆ పార్టీదే హవా. అంతకు ముందు అంటే వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నంత కాలం కడప జిల్లా ఆయన గుప్పిట్లో ఉండేది. అందుకే కడప జిల్లా కాంగ్రెస్ కు కంచుకోట. అయితే వైఎస్ మరణం తరువాత జిల్లా మొత్తం జగన్ వెంట నిలిచింది.
అయితే 2024 ఎన్నికలలో జగన్ పార్టీ ఘోర పరాజయంతో అంత వరకూ జగన్ కు పెట్టని కోటగా నిలిచిన కడపలో ఆయన పలుకుబడి మసకబారింది. ఎన్నికలలో ఆ పార్టీ జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ కేవలం మూడంటే మూడు స్థానాలలో మాత్రమే వైసీపీ విజయం సాధించింది. కడప పార్లమెంటు స్థానంలో వైసీపీ అభ్యర్థి, జగన్ పదే పదే చెబుతూ వస్తున్న చిన్న పిల్లోడు అవినాష్ రెడ్డి విజయం కూడా ఆ నియోజకవర్గం నుంచి షర్మిల రంగంలో నిలవడం వల్లనే సాధ్యమైందని పరిశీలకులు ఫలితాలు వచ్చిన అనంతరం విశ్లేషించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిల పోటీలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు భారీగా చీలిపోవడమే అవినాష్ రెడ్డి విజయానికి దోహదం చేసిందనడంలో సందేహం లేదు. ఇక పులివెందుల నుంచి పోటీ చేసిన జగన్ రెడ్డి విజయం సాధించినా మెజారిటీ అనూహ్యంగా తగ్గింది. అన్నిటికీ మించి కడప జిల్లా నుంచి వైసీపీ గెలిచిన మూడు స్థానాలలో ఒకటి జగన్ పోటీ చేసిన పులివెందుల కాగా, మరోటి కూటమి పార్టీల సీట్ల సర్దుబాటులో భాగంగా బిజెపి పోటీ చేసిన స్థానంలో అభ్యర్థి బలహీనుడు కావడం వల్ల వచ్చింది.
సరే ఆ ముచ్చట పక్కన పెడితే ఇటీవల పులివెందులలో జరిగిన నీటి సంఘాల ఎన్నికలలో తెలుగుదేశం క్లీన్ స్వీప్ చేసింది. దివంగత వైయస్ఆర్ స్వస్థలమైన బలపనూరులో కూడాతెలుగుదేశం తిరుగులేని విజయం సాధించింది. ఇక కడప కార్పొరేషన్ సైతం వైసీపీ చేజారడం ఖాయమైపోయింది. వైసీపీ కార్పొరేటర్లు పెద్ద సంఖ్యలో ఆ పార్టీని వీడి తెలుగుదేశం గూటికి చేరారు. అసలు కడప జిల్లాలో వైసీపీని ముందుండి నడిపించేందుకు నాయకుడే లేని పరిస్థితి ఇప్పుడు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. గతంలో అంటే వైఎస్ వివేకానందరెడ్డి బతికి ఉన్న కాలంలో ఆయనే అన్నీ చూసుకునే వారు. అయితే ఆయనను పక్కన పెట్టి జగన్ అవినాష్ రెడ్డిని ప్రోత్సహించారు. సరే 2019 ఎన్నికల ముందు వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఆ హత్య వెనుక ఉన్నది అవినాష్ రెడ్డే అన్నఆరోపణలు బలంగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ హత్య కేసులో అవినాష్ రెడ్డి బెయిలుపై ఉన్నారు. అది పక్కన పెడితే గత ఐదు సంవత్సరాలలో, అవినాష్ రెడ్డి జిల్లాలో పార్టీని బలోపేతం చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. అయితే ఐదేళ్లూ వైసీపీ అధికారంలో ఉండటం వల్ల పార్టీ కోట బీటలు వారుతున్న విషయాన్ని కప్పి పుచ్చి జిల్లాలో తనకు, పార్టీకి తిరుగులేదన్న బిల్డప్ ఇవ్వగలిగారు. అయితే ఎన్నికలలో పరాజయం తరువాత ఒక్కసారిగా అవినాష్ రెడ్డికి పార్టీని నడిపే సమర్థత ఇసుమంతైనా లేదన్న విషయం బహిర్గతమైంది. ఇప్పుడు జిల్లాలో పార్టీ అటు లీడర్, ఇటు క్యాడర్ లేకుండా పోయింది. చివరాఖరుకు జగన్ కూడా పులివెందులలో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు.