సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. బలగం సినిమా ఆఖరిలో తన జానపద పాటతో అందరితో కన్నీళ్లు పెట్టించిన మొగిలయ్య ఇక లేరు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన గురువారం (డిసెంబర్ 19) కన్నుమూశారు. దీంతో పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.

బలగం సినిమా తో మంచి గుర్తింపు తెచ్చుకున్న జానపద కళాకారుడు మొగిలయ్య కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతోన్న ఆయన . గత కొన్ని రోజులుగా వరంగల్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంంతో గురువారం (డిసెంబర్ 19) ఉదయం మొగిలయ్య కన్నుమూశారు. దీంతో అతని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇక మొగిలయ్య మృతిపై పలువురు సినీ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు. కాగా జానపద పాటలు పాడుకునే మొగిలయ్యను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన బలగం వేణు మొగిలయ్య మృతికి సంతాపం తెలియజేశాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక స్పెషల్ పోస్ట్ షేర్ చేశాడు. ‘మొగిలయ్య గారి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. బలగం సినిమా క్లైమాక్స్‌లో అయన గాత్రం ఎప్పటికీ మర్చిపోలేనిది. ఆయన చివరి దశలో ఆయనలోని అద్భుతమైన కళాకారుడు నా ద్వారా ప్రపంచానికి ఇంకా తెలియడం నా అదృష్టంగా భావిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశాడు వేణు.

ఇక బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా మొగిలయ్యకు నివాళి అర్పించారు. ‘నీ పాటకు చెమర్చని కళ్లు లేవు. చలించని హృదయం లేదు. నీ పాట ద్వారా తెలంగాణ ప్రేమైక జీవనాన్ని ఆవిష్కరించావ్. మాయమైపోతున్న కుటుంబ సంబంధాలను మళ్లీ గుర్తు చేశావ్. మొగులన్నా.. నీ పాట తెలంగాణ బలగాన్ని మళ్లీ చాటింది! మానవీయకోణాన్ని ఆకాశమంత ఎత్తులో నిలిపింది. మొగులయ్య గారు మరణించినా పాట రూపంలో బతికే ఉంటారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలి. వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలి’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here