డిసెంబర్ 4వ తేదీన రాత్రి పుష్ప-2 ప్రీమియర్ షోకు.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్ వచ్చారు. అల్లు అర్జున్ కోసం అభిమానులు ఒక్కసారిగా ఎగబడటంతో సంధ్య థియేటర్ దగ్గర తోపులాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా ఆమె కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై హైదరాబాద్ పోలీసులు సీరియస్‌గా స్పందించారు.
ఆ ప్రాంతం సినిమా ప్రేమికులకి అడ్డ. ఏ సినిమా రిలీజ్ అయిన ఆ ప్రాంతమంతా అభిమానుల కేరింతలతో సందడిగా మారుతుంది. ఎందుకంటే.. ఆ అడ్డాలో ఒకప్పుడు దాదాపు పదిహేనుకు పైగా థియేటర్లు ఉండేవి. ఇప్పుడు ఆ సంఖ్య కాస్త తగ్గింది. అయిన ఇప్పటికీ ఆ క్రేజ్ తగ్గలేదు. ఎందుకంటే అక్కడ ఉంది సంధ్యా థియేటర్.. ఎన్ని థియేటర్లు వచ్చినా వెళ్లిపోయిన తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది సంధ్యా థియేటర్. ఇప్పుడు వివాదంలో ఉన్నప్పటికీ సినిమా ప్రేమికుల కు విడదీయరాని ఎమోషనల్ బాండ్ సంధ్యా థియేటర్.
సినిమా అనగానే అందరికీ ఆర్టీసీ క్రాస్ రోడ్డు గుర్తుకొస్తుంది. కొత్త సినిమా రిలీజ్ అయిందంటే చాలు.. క్రాస్ రోడ్ లో వేల సంఖ్యలో సినీ లవర్స్ వాలిపోతుంటారు. తమ అభిమాన హీరోల సినిమాలు విడుదలైన రోజున.. పటాకులు, బ్యాండ్ మోతలతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోతోంది. అంతేకాదు.. ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న థియేటర్లలో చాలా సినిమాలు వంద రోజులకు పైగా ఆడాయి. పలు సినిమాలు సిల్వర్ జూబ్లీ వేడుకలను కూడా నమోదు చేసుకున్నాయి. అంతటి ప్రత్యేకత ఉన్న ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఉన్న తియేటర్లలో సంధ్య థియేటర్ మొదటి ప్లేస్ ఉంటుంది. గత పది రోజులుగా వివాదంలో, విషాదం లో నానుతున్న సంధ్య థియేటర్‌కు అభిమానులు, సినీ సెలబ్రెటీలతో ఘనమైన చరిత్రే ఉంది.
సినిమాలకు అడ్డా అయిన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ప్రాంతంలో 1979, జనవరి 18న సంధ్య 70ఎంఎం థియేటర్ ప్రారంభోత్సవం జరిగింది. అప్పటి ఉమ్మడి ఏపీ మంత్రి జి. వెంకటస్వామి ఈ థియేటర్‌ను ప్రారంభించారు. ఈ థియేటర్లో ప్రారంభోత్సవ చిత్రంగా హిందీ మూవీ షాలిమార్‌ను ప్రదర్శించారు. అప్పట్లో ఏసీ థియేటర్‌గా మాత్రమే ఈ హాలు ఉండేది. కోవిడ్ సమయంలో ఈ థియేటర్‌ను ఆధునీకరించి 4కే ప్రొజెక్షన్, డాల్మీ ఎట్మాస్ సౌండ్‌ను ఏర్పాటు చేశారు. అటు ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో గతంలో ఉన్న సుదర్శన్ 70ఎంఎం, ఓడియన్ 70 ఎంఎం, ఓడియన్ డీలక్స్, మినీ ఓడియన్, శ్రీమయూరి, ఉషా మయూరి లాంటి థియేటర్లు ఇప్పుడు కనుమరుగు అయ్యాయి.గత 45 ఏళ్లుగా సినీ ప్రేక్షకులకు సినిమా పండగ కు వేదిక గా నిలుస్తుంది సంధ్య థియేటర్.
తెలుగు సినిమాకు ఎంతటి చరిత్ర ఉందో తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఉన్న సంధ్య థియేటర్‌కి అంతటి చరిత్ర ఉంది. తెలుగు సినిమాకు ఎంతటి చరిత్ర ఉందో తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉన్న సంధ్య థియేటర్‌కి అంతటి చరిత్ర ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అప్పుడప్పుడే పెద్ద థియేటర్లు మొదలు అవుతున్నాయి. 70MM థియేటర్లు దేశంలో కొన్ని మాత్రమే ఉన్న సమయంలో సంధ్య థియేటర్ ప్రస్థానం మొదలైంది.
1980లో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో ప్రారంభం అయిన సంధ్య థియేటర్లో మొదటగా హిందీ సినిమా ‘షాలిమార్’ ప్రదర్శించడం జరిగింది. ఆ తర్వాత బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘షోలే’ సంధ్య థియేటర్లో రిలీజ్ అయ్యింది. అక్కడ నుంచి సంధ్య థియేటర్ జర్న చారిత్రాత్మకంగా కొనసాగుతూనే వచ్చింది. పాతిక సంవత్సరాలుగా స్టార్ హీరోల సినిమాలు అనగానే ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో సంధ్య థియేటర్ మెయిన్ థియేటర్‌గా చెప్పుకునే వారు. మల్టీప్లెక్స్‌లు లేని రోజుల్లో సెలబ్రెటీలు మొత్తం ఆర్టీసీ క్రాస్ రోడ్‌కి క్యూ కట్టే వారు. మొదటి రోజు తమ సినిమాలను థియేటర్లలో చూడాలి అనుకున్న వారు, వారం మధ్యలో జనాలతో సినిమాలు చూడాలనుకున్న స్టార్స్ నుంచి ప్రతి ఒక్క సెలబ్రెటీ ఆర్టీసీ క్రాస్రోడ్స్కి వెళ్లేవారు. అక్కడ అత్యధికంగా సంధ్య థియేటర్లోనే సినిమాలను చూసే వారు.
సంధ్య థియేటర్లో ఒకప్పుడు 1,500 మంది ప్రేక్షకుల కెపాసిటీతో ఉండేది. కానీ ఆ తర్వాత వసతులు పెంచుతూ, మోడ్రన్‌గా మార్చిన సమయంలో 1,323కి సీటింగ్ కెపాసిటీని తగ్గించడం జరిగింది. ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఎన్నో థియేటర్లు ఉన్నా సంధ్య థియేటర్ చాలా స్పెషల్ థియేటర్‌గా స్టార్స్ చెబుతూ ఉంటారు. ఆ థియేటర్లో తమ సినిమా పడాలి అంటూ పెద్ద హీరోలు పోటీ పడేవారు. ఒకప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్లో తమ సినిమా పడాలి అంటే తమ సినిమా పడాలి అంటూ గొడవలు పడిన సందర్భాలు ఉన్నాయి. సంధ్య థియేటర్‌ను మెయిన్ థియేటర్‌గా విడుదల చేసే వారు. ఒకప్పుడు సినిమాలు విడుదల అయ్యే థియేటర్ల సంఖ్య చాలా తక్కువ ఉండేది. అయితే సంధ్య ధియేటర్ కచ్చితంగా తమ థియేటర్ల జాబితాలో ఉండాలి అంటూ స్టార్ హీరోలు సెంటిమెంట్‌గా నిర్మాతలకు చెప్పే వారు.
సంధ్య 70MMతో పాటు 35MM కూడా ఉంటుంది. 1981లో సంధ్య 35MM థియేటర్ మొదలైంది. స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు ఎంతో మందిని ప్రేక్షకులకు పరిచయం చేసిన సంధ్య థియేటర్ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే వివాహిత మృతి చెందడంతో థియేటర్ పై చర్యలు ఎందుకు తీసుకోకూడదు చెప్పాలి అంటూ పోలీసులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పది రోజుల్లో ఆ నోటీసులకు సరైన సమాధానం ఇవ్వకుంటే సంధ్య థియేటర్ మూతపడే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయమై సినీ ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ థియేటర్ తో సినీ ప్రేక్షకులే కాదు ఇందులో పని చేసేవారికి విడదీయరాని అనుబంధం ఏర్పడింది. కొన్ని ఏళ్లుగా ఇక్కడే పనిచేస్తున్న సిబ్బంది, నిర్వాహకులు, ప్రేక్షకులు అందరికీ సంధ్య ధియేటర్ ఒక ఎమోషనల్ బాండ్.
ఇక సంధ్యా 70MM థియేటర్ నిర్వహణలో లోపాలు చాలా ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. సంధ్య 70MM ,సంధ్య 35MM థియేటర్లు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. రెండింటికి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఒకవైపునే ఉంటాయి. రెండు థియేటర్లలో కలిపి దాదాపు 2520 మంది కూర్చునే సామర్థ్యం ఉంది. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ లను సూచించే సరైన సైన్ బోర్డులు లేవు. అనుమతి లేకుండా థియేటర్ వెలుపల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రేక్షకులు పోగవ్వడానికి అవకాశం ఇచ్చారు. దాంతో పాటూ థియేటర్లో మౌలిక సదుపాయాలు లేవు. వీటన్నిటితో పాటూ అల్లు అర్జున్ వస్తున్నాడని పోలీసులకు సమాచారం ఇవ్వడంలో థియేటర్ నిర్వాహకులు ఫెయిల్ అయ్యారు. ఇక అతను వచ్చినప్పుడు హీరో ప్రైవేట్ సెక్యూరిటీని కూడా లోపలికి అనుమతించారు. టికెట్ కొన్న వాళ్లు మాత్రమే కాక అందరూ థియేటర్ లోపలికి వచ్చేశారు. ఈ విషయాన్ని థియేటర్ సిబ్బంది కంట్రోల్ చేయలేకపోయారు. అనధికారికంగా చాలా ఎక్కువ మంది లోపలికి వచ్చారు కాబట్టే తోపులాట జరిగిందని పోలీసుల వాదన. ఇక తాజాగా ప్రభుత్వ నోటీసులతో సంధ్యా థియేటర్ యాజమాన్యం సమాధానం ఇవ్వబోతోందన్నదీ హాట్‌టాపిక్‌గా మారింది.