జగపతి బాబు, ఆమని రోజా సూపర్ హిట్ మూవీ శుభలగ్నం చాలా మందికి గుర్తు ఉండే ఉంటుంది. తాను ప్రేమించినవాడికి పెళ్లైంది.. భార్య పిల్లలతో సంతోషంగా కాపురం చేసుకున్నాడని తెలిసి.. భార్యకు డబ్బు ఆశ చూపించి .. ఆమె భర్తని కొనేసి.. తాను పెళ్లి చేసుకుంది. సినిమాలోని ఈ కథే.. నిజ జీవితంలో కూడా జరిగింది. కాకపోతే మన దేశంలో కాదు.. మన పొరుగున ఉన్న డ్రాగన్ కంట్రీలో.. ఆ దేశంలో కూడా పెళ్లి పట్ల నమ్మకం, విశ్వాసం, సంప్రదాయం కుటుంబ జీవిత విధానం దాదాపు భారతీయుల వలెనే ఉంటుంది. అందుకనే ఇప్పుడు ఈ విచిత్ర విడాకుల కథ వైరల్ అవుతోంది.

ఒక మహిళ .. జంట, విడాకుల కోసం పరిహారం ఈ విషయాలతో చైనాలో అసాధారణమైన కేసు వార్తల్లో నిలిచింది. హోన్షి అనే మహిళ తన ప్రేమికుడు హాన్ అతని మొదటి భార్య యాంగ్‌కి విడాకులు ఇప్పించే ప్రయత్నంలో హాన్ భార్య యాంగ్ కు 1.2 మిలియన్ యువాన్లు (అంటే మన దేశ కరెన్సీలో రూ. 1.39 కోట్లు) చెల్లించింది. డబ్బులు తీసుకున్నాక యాంగ్ ప్లేట్ తిప్పేసింది.. తన భర్తకు విడాకులు ఇవ్వడానికి నో చెప్పింది. దీంతో చేసేది ఏమీ లేక షి .. తన డబ్బులు తనకు యాంగ్ నుంచి తిరిగి ఇప్పించమని కోరుతూ కోర్టును ఆశ్రయించింది. వివరాల్లోకి వెళ్తే..

2013లో హాన్ అనే వ్యక్తి యాంగ్ అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. మరోవైపు హాన్ తన బిజినెస్ పార్టనర్ అయిన హోన్షి అనే యువతితో ప్రేమాయణం సాగిస్తున్నాడు. వీరికి కూడా ఒక కొడుకు పుట్టాడు. దీంతో హోన్షి తన అక్రమ సంబంధాన్ని సమాజం ఆమోదించే భార్యాభర్తల బంధంగా మార్చుకోవాలని భావించింది. దీంతో ప్రియుడిని భర్తగా మార్చుకునే ప్రయత్నంలో మొదటి భార్య యాంగ్ కు డబ్బులను ఎర వేసింది. మొదటి భార్య యాంగ్ కు 1.2 మిలియన్ యువాన్లు(రూ.1.39 కోట్లు) తీసుకుని తన భర్తకు డైవర్స్ ఇచ్చి తన పిల్లలతో కలిసి ఉండడానికి అంగీకరించింది కూడా.. యాంగ్ డైవర్స్ ఇస్తాను అనడంతో ఎగిరి గంతేసిన హోన్షి .. వెంటనే యాంగ్ అడిగినంత డబ్బులు ఇచ్చింది. తాను అడిగినంత డబ్బులు వచ్చిన తర్వాత యాంగ్ హోన్షికి ఓ రేంజ్ లో షాక్ ఇచ్చింది.

తనను మోసం చేసిన భర్తకు ఆమె ప్రియురాలికి గుణపాటం చెప్పాలనుకుంది. దీంతో హోన్షి ఇచ్చిన డబ్బులు తీసుకుని.. తర్వాత డైవర్స్ కు నో చెప్పింది. దీంతో చేసేది ఏమీ లేక తన డబ్బులు అయినా తనకు ఇప్పించి అంటూ కోర్టు మెట్లు ఎక్కింది హోన్షి. కోర్టులో కూడా హోన్షికి షాక్ తగిలింది. హోన్షి చెప్పింది విన్న కోర్టు.. వారిద్దరూ చట్టప్రకారం విడాకులు తీసుకోలేదు కనుక భార్యాభార్తలే అని చెప్పడమే కాదు.. నైతిక విలువలు లేకుండా జీవించడం తప్పు.. పైగా విడాకులు తీసుకోమని బలవంతం చేయడం.. చట్ట ప్రకారం నేరం అని వ్యాఖ్యానించింది. ఇక హోన్షి .. యాంగ్ కు డబ్బులు ఇచ్చి నట్లు ఎటువంటి సాక్ష్యాధారాలు లేవు కనుక తాము ఏమీ చేయలేమని మెత్తగా హోన్షికి చివాట్లు పెట్టింది. అయితే మొదటి భార్య యాంగ్ తన భర్త, సవతి హోన్షి పెడుతున్న పోరును భరించలేక చట్టబద్ధంగా విడిపోవడానికి ముందుకు వచ్చింది. దీంతో హాన్, యాంగ్ ఇప్పుడు “కూలింగ్-ఆఫ్ పీరియడ్”లో ఉన్నారు.

చైనీస్ ప్రభుత్వం 2021లో ఈ “కూలింగ్-ఆఫ్” వ్యవధిని ప్రారంభించింది. దీని ప్రకారం భార్యాభర్తలు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత 30 రోజులు వేచి ఉండాల్సిన అవసరం ఉంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here