Virat Kohl Shifting to London with Family: విరాట్ కోహ్లి చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ బాంబు పేల్చాడు. భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తన కుటుంబంతో కలిసి లండన్‌కు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడని వెల్లడించాడు. దైనిక్ జాగ్రన్‌ ప్రకారం, కోహ్లీ త్వరలో భారతదేశం వదిలి లండన్‌కు షిఫ్ట్ అవుతున్నాడని శర్మ చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లి లండన్ వెళ్లనున్నారనే ఊహాగానాలు గత కొంతకాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ మ్యాచ్‌ల మధ్య విరామ సమయంలో కోహ్లీ తరచుగా లండన్ వీధుల్లో కనిపిస్తుంటాడు. దీంతో ఈ పుకార్లకు బీజం పడింది. ఈ క్రమంలో రాజ్ కుమార్ శర్మ మాట్లాడుతూ.. “అవును, విరాట్ లండన్ వెళ్లాలని యోచిస్తున్నాడు. అతను అతి త్వరలో భారతదేశం వదిలి వెళ్లిపోతాడు, ”అంటూ ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చాడు.

కాగా, ప్రస్తుత ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లీ గొప్ప ఫామ్‌లో లేడు. బయటకు వెళ్లే బంతలును ఎదుర్కొనడంలో నిరంతరం కష్టపడుతున్నాడు. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో కోహ్లీ సెంచరీ చేసినప్పటికీ ఆ తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు. అయితే మెల్‌బోర్న్, సిడ్నీలలో కోహ్లి ఫాం అందిపుచ్చుకుంటాడని, సెంచరీలు సాధిస్తాడని శర్మ భావిస్తున్నాడు.

ఈ క్రమంలో మరో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ ఆర్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్లు కూడా అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకునే ఛాన్స్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, విరాట్ కోహ్లీలో చాలా క్రికెట్ మిగిలి ఉందని, 2027 వన్డే ప్రపంచ కప్ ఆడతాడని రాజ్‌కుమార్ శర్మ తెలిపాడు.

ఈ క్రమంలో విరాట్ నిజంగా దేశం విడిచి వెళ్తాడా? లండన్ మారడం గురించి చర్చ జరుగుతోంది. విరాట్ కోహ్లి తన భార్య అనుష్క శర్మ, తన పిల్లలతో కలిసి లండన్‌కు షిఫ్ట్ కావాలంటే అక్కడి పౌరసత్వం పొందాల్సి ఉంటుంది. అయితే, దీనిపై విరాట్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

యూకే పౌరసత్వం పొందాడా?

UK పౌరసత్వం పొందడానికి అనేక మార్గాలు ఉన్నాయి. పిల్లలు పుట్టుకతో యూకే పౌరసత్వాన్ని పొందవచ్చు. కానీ, వారి తల్లిదండ్రులలో కనీసం ఒకరికి బ్రిటిష్ పౌరసత్వం ఉండాల్సి ఉంటుంది. ఇది కాకుండా, బ్రిటిష్ పౌరుడిని వివాహం చేసుకుంటే అక్కడి పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సిటిజన్‌షిప్ సెటిల్‌మెంట్ స్కీమ్ కింద, స్థిరపడి ఉన్న వ్యక్తులు కూడా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎలా దరఖాస్తు చేయాలి?

దరఖాస్తు చేయడానికి, దరఖాస్తుదారు వయస్సు 18 ఏళ్లు పైబడి ఉండాలి. ఇందుకోసం దాదాపు ఐదేళ్ల పాటు యూకేలో ఉండాల్సి ఉంటుంది. బ్రిటీష్ పౌరుడిని వివాహం చేసుకున్నట్లయితే, మూడు సంవత్సరాల పాటు శాశ్వత నివాసం అవసరం. దీనితో పాటు, ఎటువంటి నేర చరిత్ర ఉండకూడదు. ఆంగ్ల భాష అవసరాలతో పాటు, లైఫ్ ఇన్ యూకే అనే పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం కూడా అవసరం.

UKలో పౌరసత్వం పొందడానికి భారతీయులు తప్పనిసరిగా పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, జనన ధృవీకరణ పత్రం, హోమ్ ఆఫీస్ ట్రావెల్ డాక్యుమెంట్ లేదా క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్ వంటి ఏదైనా చట్టపరమైన గుర్తింపు రుజువును కలిగి ఉండాలి. ఇందులో ‘లైఫ్ ఇన్ యూకే’ టెస్ట్, ఇంగ్లీష్ టెస్ట్ ఫలితాన్ని కూడా చూపించాల్సి ఉంటుంది. అలాగే, యూకేలో ఇల్లు చూపించాల్సి ఉంటుంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here