ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు, నారా లోకేశ్‌ తనయుడు దేవాన్ష్‌ చెస్ ఆటలో చరిత్ర సృష్టించాడు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన చెస్ టోర్నమెంట్‌లో సీఎం చంద్రబాబు దగ్గరుండి మనవడిని గెలిపించారు. రాయ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన టోర్నమెంట్‌లో డిస్క్‌ను వేగంగా పూర్తి చేయడంతోపాటు 127 కదలికలతో దేవాన్ష్ ఈ రికార్డ్‌ను సొంతం చేసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనవడు నారా దేవాన్ష్‌కు చెస్ అంటే విపరీతమైన ఆసక్తి. ఇటీవల జరిగిన ప్రముఖ చెస్ టోర్నమెంట్‌లో దేవాన్ష్ వరల్డ్ రికార్డును అటెంప్ట్ చేశాడు. అందులో చెస్ పట్ల తన ఆసక్తిని మరియు నైపుణ్యాన్ని ప్రదర్శించే సమయంలో తన తాత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన పక్కనే ఉండాలని అనుకున్నారు. వెంటనే తాతకు ఫోన్ చేశాడు.

వరల్డ్ రికార్డు అటెంప్ట్‌ని తన తాత సమక్షంలో చేయాలని అనుకున్నాడు దేవాన్ష్. తాత తన వెంట ఉంటే తనకి మరింత ధైర్యంగా ఉంటుందని కచ్చితంగా గెలుస్తానని భావించాడట. వెంటనే తాత చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేసి, తాత.. మీరు హైదరాబాద్ రావాలి, నా గేమ్ సమయంలో మీరు పక్కనే ఉండాలంటూ ఫోన్ చేశాడట దేవాన్ష్. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా.. క్షణం తీరిక లేకుండా రాష్ట్రాభివృద్ధి పనల్లో బిజీగా ఉన్న ముఖ్యమంత్రి ఒక్కసారిగా మనవడి ఫోన్ కాల్‌తో ముగ్ధుడయ్యాడు. వెంటనే హైదరాబాద్‌కు వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని తన కార్యాలయాన్ని ఆదేశించారు. దీంతో మంగళవారం(డిసెంబర్ 17) సాయంత్రం హైదరాబాద్ వెళ్లిన ముఖ్యమంత్రి బుధవారం ఉదయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో జరిగిన టోర్నమెంట్‌లో దేవాన్ష్ పక్కనే ఉండి స్వయంగా మనవడి ప్రతిభ ని వీక్షించారు. ఆనందించి నేరుగా అక్కడి నుంచే తిరిగి అమరావతికి చేరుకున్నారు.

ఆకట్టుకున్న నారా దేవాన్ష్

ఈ చెస్ టోర్నమెంట్‌లో రాష్ట్రవ్యాప్తంగా వివిధ వయసుల నుండి ప్రాతినిధ్యం కలిగిన చెస్ క్రీడాకారులతో జోరుగా సాగింది. నారా దేవాన్ష్ ఈ టోర్నమెంట్‌లో పాల్గొని తన సహజ ప్రతిభను, వ్యూహాత్మక ఆలోచనలను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. రాయ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన టోర్నమెంట్‌లో దేవాన్ష్ ఫాస్టెస్ట్ టవర్ ఆఫ్ హనోయి – 7 డిస్క్, 7 – డిస్క్‌ను వేగంగా పూర్తి చేయడం, 127 మొత్తం కదలికలతో దేవాన్ష్ ఈ రికార్డ్‌ను సాధించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మనమడు దేవాన్ష్ తోపాటు ఇతర చిన్నారులను ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

యువ క్రీడాకారులకు ప్రోత్సాహం

ఈ టోర్నమెంట్‌లో నారా దేవాన్ష్ మాత్రమే కాకుండా, అనేక మంది చిన్నారులు తమ ప్రతిభను చాటుకున్నారు. టోర్నమెంట్‌లో విజేతలతో పాటు పాల్గొన్న క్రీడాకారులకు చంద్రబాబు చేతుల మీదుగా బహుమతులు అందజేయడం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ చదువుతోపాటు చెస్ వంటి క్రీడలు పిల్లల ఆలోచనా శక్తిని పెంపొందిస్తాయన్నారు చంద్రబాబు. నారా దేవాన్ష్ కూడా ఈ టోర్నమెంట్‌లో భాగస్వామి కావడం చూసి గర్వంగా ఉందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. దేవాన్ష్ కు చెస్‌ పట్ల ఆసక్తి, ప్రదర్శించిన శ్రద్ధ, నైపుణ్యం ఆశ్చర్యపరచిందన్నారు చంద్రబాబు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here